పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీవో వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం పిలుపునిచ్చారు. ఆంధ్ర ప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి నేతృత్వంలో, సస్టైనబుల్ రీజిలియన్స్ యూనిట్ – జివిఎంసి భాగస్వామ్యంతో మద్దిలపాలెం అక్షర ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నీటి వనరులను సంరక్షించుకోవడం, ప్రభుత్వం నిషేధించిన ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా పేర్కొన్నారు.
ఈ అవగాహన కార్యక్రమంలో రోటరేక్ట్ క్లబ్ వైజాగ్ రోయల్స్ సభ్యురాలు చాందిని మాట్లాడుతూ, ఒక్కసారి వాడి వదిలేసే ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతుందని తెలిపారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ కోసం తాము అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు.
స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించడానికి ఇంటి వ్యర్థాలను ఆదాయవంతంగా నిర్మూలించాలని ఎపిపిసిబి అవగాహన కార్యక్రమాల్లో సూచించిందని జెవి రత్నం తెలిపారు. ఎకో వైజాగ్ ను అభివృద్ధి చేయడానికి స్థానిక సంస్థలు, విద్యార్థులు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. పర్యావరణ హితమైన జీవన విధానాన్ని అలవరుచుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ టీం ప్రతినిధి రామ్ అప్పారావు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడానికి అందరి సహకారం అవసరమని నిర్వాహకులు తెలిపారు. స్వచ్ఛమైన పర్యావరణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు.