కరప మండలం, వేములవాడ గ్రామంలో పీపుల్ సేవ్ ఫర్ హెల్ప్ చారిటబుల్ ట్రస్ట్ 19వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ ట్రస్ట్ వ్యవస్థాపకులు డా. పాట్నీడి సూర్యనారాయణ రావు (ప్రకాష్), శ్రీమతి పాల వేణి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. చుట్టుపక్కల గ్రామాల పేద ప్రజలకు భోజనాలను ఏర్పాటు చేసి, అనంతరం మహిళలకు చీరలు, పురుషులకు దుప్పట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా నక్కా సత్యనారాయణ మాట్లాడుతూ ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థులకు కంప్యూటర్ విద్యను అందించడంతో పాటు భవిష్యత్తులో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించాలని కోరారు. అలాగే, ఈ సేవా కార్యక్రమాలు మరింత విస్తరించి మరెన్నో అవసరమైన సేవలను అందించాలన్నారు.
కరప మండల మాజీ ఎంపీపీ కమిడి సీతామహాలక్ష్మి మాట్లాడుతూ ఈ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమని తెలిపారు. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి విద్య, వైద్యం వంటి రంగాల్లో పేద ప్రజలకు సహాయపడటంలో అంకిత భావంతో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి సంస్థలు మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు మేలు చేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పాట్నిడి వెంకటరమణ (జయ బాబు), అప్పన్నపల్లి అనంతలక్ష్మి, కొల్లగాని బుజ్జమ్మ, అడపా లక్ష్మణరావు, కరప మండల నాయకులు, అధికారులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వారందరి సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.