ఖోఖో ప్రపంచకప్ గెలిచి దేశ కీర్తిని పెంచిన కర్ణాటక ఆటగాళ్లు తమకు తగిన గౌరవం దక్కలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం తమ ఆటగాళ్లకు రూ. 2.25 కోట్లు, ఉద్యోగం ప్రకటించగా, కర్ణాటకలో మాత్రం రూ. 5 లక్షలతో సరిపెట్టారని విమర్శించారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించిన బహుమతిని తిరస్కరిస్తున్నట్లు ప్రకటించిన ఎం కె గౌతమ్, చైత్ర బి, ఇది ప్రభుత్వాన్ని అవమానించడమేమీ కాదని, తమ గౌరవాన్ని కాపాడుకునే చర్య అని స్పష్టం చేశారు.
గౌతమ్ మాట్లాడుతూ, తమ విజయం దేశానికి గర్వకారణమని, అయితే కర్ణాటక ప్రభుత్వం దీనిని తగిన స్థాయిలో గౌరవించలేదని వాపోయాడు. మహారాష్ట్రలో ఆటగాళ్లకు భారీ రివార్డుతో పాటు ప్రభుత్వ ఉద్యోగం కూడా అందిస్తుండగా, తాము మాత్రం సరైన ప్రోత్సాహం లేక ఇబ్బంది పడుతున్నామని తెలిపాడు. కర్ణాటక ప్రభుత్వం తమ నిర్ణయాన్ని పునఃసమీక్షించి న్యాయం చేయాలని కోరాడు.
మహిళా జట్టు సభ్యురాలు చైత్ర మాట్లాడుతూ, తమ కష్టానికి తగిన గుర్తింపు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఖోఖో క్రీడలో ప్రపంచ స్థాయిలో విజయాన్ని సాధించినా, ఇతర క్రీడా విభాగాలకిచ్చే గౌరవం మాత్రం తాము పొందలేకపోతున్నామని చెప్పింది. కేవలం రూ. 5 లక్షల బహుమతితో క్రీడను కొనసాగించడం ఎలా? అని ప్రశ్నించింది. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది.
క్రీడా అభివృద్ధికి ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సాహం అందకపోతే, యువ ప్రతిభను వెలుగులోకి తేవడం కష్టమవుతుందని ఈ ఆటగాళ్లు చెబుతున్నారు. మహారాష్ట్ర మాదిరిగా తమను కూడా గౌరవించాలని, ప్రపంచకప్ గెలిచిన వారిగా తమకు తగిన గుర్తింపు ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.