భారత్ టెక్నాలజీ రంగంలో వేగంగా పురోగమిస్తోంది. దీని భాగంగా దేశీయ దిగ్గజ కంపెనీలు తమ వంతుగా భారీ పెట్టుబడులు పెడుతున్నాయి. ముఖ్యంగా, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్‌ను నిర్మించనున్నారు. ఈ డేటా సెంటర్ 3 గిగావాట్ల సామర్థ్యంతో ఉండనుంది.
ఈ డేటా సెంటర్ నిర్మాణం కోసం రిలయన్స్ అధునాతన ఏఐ చిప్‌లను కొనుగోలు చేయనుంది. అధునాతన టెక్నాలజీతో నిర్మించబోయే ఈ సెంటర్ భారత్‌లో డిజిటల్ మౌలిక వసతులను విస్తృతంగా పెంచే అవకాశం ఉంది. భారీ డేటా నిల్వకు, ఏఐ కంప్యూటింగ్‌కు ఈ సెంటర్ కేంద్రంగా మారనుంది.
2023 అక్టోబర్‌లో రిలయన్స్, ఎన్విడియా కలిసి ఏఐ మౌలిక వసతుల ఏర్పాటుపై చర్చలు జరిపాయి. భవిష్యత్‌లో భారత్‌ను ప్రపంచ ఏఐ కేంద్రంగా మార్చే లక్ష్యంతో రిలయన్స్ అడుగులు వేస్తోంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా భారత ఐటి రంగానికి కొత్త శకం ప్రారంభమవుతుందని అంచనా.
ముఖేశ్ అంబానీ మాట్లాడుతూ, దేశంలోని ప్రతి ఒక్కరికీ ఏఐని అందుబాటులోకి తీసుకురావడమే తన లక్ష్యమని తెలిపారు. ఈ డేటా సెంటర్ భారతదేశానికి భారీ టెక్నాలజీ పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు, ఆర్థికంగా కూడా మూడో అతిపెద్ద డిజిటల్ హబ్‌గా దేశాన్ని తీర్చిదిద్దనుంది.