మహారాష్ట్రలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ ప్రమాదం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం బాధితులకు అన్ని రకాల సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
పుష్పక్ ఎక్స్ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయనే వదంతులు ప్రయాణికుల్లో ఆందోళన రేపాయి. భయంతో చైన్ లాగి రైలు ఆపిన ప్రయాణికులు హుటాహుటిన కిందకు దిగి పరుగులు తీశారు. అయితే అదే సమయంలో పక్క ట్రాక్‌పై వేగంగా వస్తున్న మరో రైలు వారిపై నుంచి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు.
ప్రమాద ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సహాయక చర్యలు చేపట్టింది. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రభుత్వ స్థాయిలో ప్రమాదానికి గల కారణాలను విశ్లేషించి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
రైల్వే శాఖ ఈ ఘటనపై దర్యాప్తు మొదలుపెట్టింది. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించారు. ప్రమాద కారణంగా ప్రయాణికులకు కలిగిన అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని రైలు సేవలు మరింత బలోపేతం చేయాలని అధికారులను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.