కేటీదొడ్డి మండలం ఇర్కిచెడు గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం జిల్లా ఇంప్లాయ్మెంట్ అధికారి ప్రియాంక ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు విద్యా ప్రమాణాలు, మధ్యాహ్న భోజన పథకం అమలును ఆమె పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడుతూ, పదవ తరగతి విద్యార్థులకు మోటివేషనల్ క్లాసులు, ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సూచించారు.
పదవ తరగతి విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలంటే పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరు కావాలని ప్రియాంక అన్నారు. ఉపాధ్యాయులు చెప్పే విషయాలను మనసుపెట్టి నేర్చుకుంటే ఒత్తిడికి గురి కాకుండా పరీక్షల్లో మెరుగైన ప్రతిభ కనబరచవచ్చన్నారు. వచ్చే మూడు నెలలు విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే కీలక సమయమని, టెస్టుల్లో ఉత్తమ ప్రతిభ చూపితే వార్షిక పరీక్షలు సులభంగా అధిగమించవచ్చని పేర్కొన్నారు.
విద్యతో పాటు మంచి లక్షణాలు అలవర్చుకోవడం ద్వారా విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని సూచించారు. పదవ తరగతి పూర్తయ్యే సమయానికి తమ భవిష్యత్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని విద్యార్థులకు వివరించారు. అనంతరం విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.
అంతకుముందు పాఠశాలలో పారిశుద్ధ్యాన్ని పరిశీలించి, వంటగది, మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచాలని ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాలలో విద్యార్థులకు మంచి వాతావరణం అందించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీపీఓ నర్సింహులు, ప్రధానోపాధ్యాయులు ఎలిషా, కౌన్సిలర్ సురేష్, చైల్డ్ హెల్ప్ లైన్ జయన్న, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.