మంగళగిరి మండలం నవులూరు గ్రామంలో వివాహితపై దురుసుగా ప్రవర్తించిన ఘటన నేపథ్యంలో ఇద్దరు యువకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరగగా, ఒకరు మరొకరిపై దాడి చేయడంతో ఇద్దరికీ గాయాలయ్యాయి. దీంతో మంగళగిరి రూరల్ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ఈ సంఘటనలో సంబంధిత యువకులపై మండల ఎమ్మార్వో వద్ద 5 లక్షల రూపాయల బైండోవర్ చేయడం జరిగింది. ఎవరూ ఇటువంటి గొడవలకు పాల్పడకూడదని, శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలు తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. గ్రామస్తుల మధ్య సామరస్యాన్ని కాపాడాలని సూచించారు.
ముఖ్యంగా యువత అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, వివాదాస్పద ఘటనలకు దారితీయకుండా సంయమనంతో వ్యవహరించాలని పోలీసులు సూచించారు. చిన్న చిన్న గొడవలు భవిష్యత్తును నాశనం చేసే ప్రమాదం ఉందని తెలిపారు. గ్రామాల్లో శాంతిని పరిరక్షించేందుకు పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.
గ్రామ ప్రజలు శాంతియుతంగా ఉండాలని, ఏ విధమైన గొడవలు, దౌర్జన్యాలకు పాల్పడవద్దని పోలీసులు హెచ్చరించారు. యువత తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని గొడవలకు దూరంగా ఉండాలని, సమాజంలో మంచిపేరు తెచ్చుకునేలా నడుచుకోవాలని మంగళగిరి రూరల్ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్ సూచించారు.