అమెరికా అధ్యక్ష పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే డొనాల్డ్ ట్రంప్ పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ‘బర్త్ రైట్ సిటిజన్ షిప్ రద్దు’ని ఆయన తన తొలి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లలో ప్రకటించారు. అయితే, ఈ నిర్ణయానికి అమెరికాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
అమెరికా వ్యాప్తంగా 22 రాష్ట్రాలు ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ న్యాయపోరాటం ప్రారంభించాయి. ట్రంప్ ఆదేశాలు జారీ చేసిన 24 గంటల్లోనే, ఈ నిర్ణయం రాజ్యాంగానికి విరుద్ధమని ఆరోపిస్తూ కోర్టుల్లో దావాలు వేశారు. న్యూయార్క్, కాలిఫోర్నియా వంటి రాష్ట్రాలు ఈ నిర్ణయంపై మండిపడుతున్నాయి.
కాలిఫోర్నియా అటార్నీ జనరల్ మాట్లాడుతూ, అమెరికా రాజ్యాంగం ప్రకారం యూఎస్ఏలో జన్మించిన ప్రతి వ్యక్తికి పుట్టుకతోనే పౌరసత్వం లభిస్తుందని తెలిపారు. 14వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ హక్కును పునరుద్ధరించామని వివరించారు. ట్రంప్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని, ఈ విధంగా తీసుకున్న చర్యలు తన పరిధిని దాటాయంటూ ఆయనపై మండిపడ్డారు.
అమెరికా రాజ్యాంగ నిపుణులు కూడా ఈ పౌరసత్వ హక్కును మార్చడం సాధ్యం కాదని, రాజ్యాంగ సవరణ అవసరమని అభిప్రాయపడుతున్నారు. 22 రాష్ట్రాల వ్యతిరేకత కారణంగా రాజ్యాంగ సవరణ చాలా కష్టమని వారి అభిప్రాయం.