బాపట్ల జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి మొబైల్ హ్యాకింగ్ ఘటనను గమనించి మంగళవారం ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రకటన విడుదల చేశారు. హ్యాకర్లు కలెక్టర్ గుర్తింపును దుర్వినియోగం చేస్తున్నారని, ప్రజలు, ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.
వివిధ ఫోన్ నంబర్ల ద్వారా హ్యాకర్లు కలెక్టర్ పేరుతో సందేశాలు పంపుతున్నారని జిల్లా యంత్రాంగం గుర్తించింది. ప్రత్యేకంగా +94724297132 నెంబర్ నుండి కొందరికి సందేశాలు వెళ్లాయని అధికారులు తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే సందేశాలకు స్పందించవద్దని కలెక్టర్ హెచ్చరించారు.
కలెక్టర్ ఫోటో, గుర్తింపు చిహ్నాలను ఉపయోగించి హ్యాకర్లు ప్రజలను మోసగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి సందేహాస్పదమైన సందేశాలు వచ్చినా వెంటనే అధికారులకు తెలియజేయాలని ఆయన సూచించారు.
హ్యాకింగ్ ఘటనపై జిల్లా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గుర్తు తెలియని నంబర్ల నుంచి అనుమానాస్పదంగా వచ్చే సమాచారాన్ని తక్షణమే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కలెక్టర్ జె. వెంకట మురళి విజ్ఞప్తి చేశారు. సైబర్ నేరగాళ్ల నుండి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచించారు.