జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి దాడికి తెగబడ్డారు. భద్రతా బలగాలు ఉగ్రవాదుల కదలికలను గుర్తించి సోమవారం నార్త్ జమ్మూలో గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జవాను పంగల కార్తీక్ తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం ఆయన మరణించారు.
గాయపడిన వెంటనే కార్తీక్‌ను తోటి జవాన్లు ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ తీవ్రగాయాలతో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో ఆయన స్వగ్రామమైన చిత్తూరు జిల్లా బంగారు పాల్యం మండలం రాగి మానుపెంటలో విషాదం నెలకొంది. కార్తీక్ 2017లో భారత సైన్యంలో చేరి దేశసేవలో నిలిచారు.
కార్తీక్ ఇటీవల దీపావళి సందర్భంగా తన కుటుంబంతో సమయం గడిపి వారం రోజుల క్రితమే తిరిగి విధులకు చేరారు. మే నెలలో మరోసారి ఇంటికి వస్తానని చెప్పి వెళ్లిన కార్తీక్ విగతజీవిగా తిరిగి రావడం గ్రామస్థులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.
జవాను కార్తీక్ వీరమరణంపై గ్రామస్థులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. సైనికుడిగా దేశానికి సేవలందించిన కార్తీక్ చరిత్రలో నిలిచిపోతారని గ్రామ ప్రజలు భావిస్తున్నారు. ఆయనకు సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.