ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించనుంది. ఈ క్రమంలో జనన, మరణ ధృవీకరణ పత్రాలను వాట్సాప్ ద్వారా పొందే అవకాశాన్ని కల్పించేందుకు కసరత్తు చేపట్టింది. మొదటగా తెనాలీలో ప్రాయోగికంగా ఈ సేవలను అమలు చేసి, తుది సమీక్ష అనంతరం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించింది.
సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ మాట్లాడుతూ, ప్రభుత్వం సేవలను మరింత సులభతరం చేయడానికి వాట్సాప్ గవర్నెన్స్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. జనన, మరణ ధృవీకరణ పత్రాల జారీకి సంబంధించి తెనాలీలో ప్రయోగాత్మకంగా సాంకేతిక సమస్యలను విశ్లేషించి, తుది నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
ఆర్టీజీఎస్ అధికారులు ఈ సేవలను విజయవంతంగా అమలు చేయడానికి అవసరమైన సాంకేతిక ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. జనన, మరణ ధృవీకరణ పత్రాల కోసం ప్రత్యేకంగా “ఆంధ్రప్రదేశ్ సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్” పోర్టల్ రూపొందించబడిందని, దీనిని డేటా ఇంటిగ్రేషన్ ద్వారా మరింత సమర్థవంతంగా అమలు చేయనున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ, పురపాలక శాఖ, పంచాయతీ రాజ్ శాఖల అధికారులు పాల్గొన్నారు. జనన, మరణ ధృవీకరణ పత్రాలు వాట్సాప్ ద్వారా పొందే ప్రక్రియను వేగంగా అమలు చేసి ప్రజలకు సులభతరంగా అందించేందుకు సంబంధిత శాఖలతో సమన్వయం చేసేందుకు సూచనలు చేశారు.