కడప ఇరిగేషన్ శాఖలో అసిస్టెంట్ ఇంజినీర్‌గా (ఏఈ) పనిచేస్తున్న నాగరాజు (42) ఆదివారం ఆకస్మిక గుండెపోటుతో మృతి చెందారు. కడపలోని KSRM ఇంజినీరింగ్ కాలేజీ మైదానంలో క్రికెట్ ఆడుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తోటి ఆటగాళ్లు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు.
నాగరాజును కడపలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా, వైద్యులు ఆయనను పరీక్షించి మరణించినట్లు ప్రకటించారు. ఆయనకు ఇటీవలే ఆరోగ్య సంబంధిత సమస్యలు లేవని, పూర్తి ఆరోగ్యంగా ఉండేవారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆకస్మిక గుండెపోటుతో మరణించడం అందరిని దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఈయనకు త్వరలో డిప్యూటీ ఇంజినీర్ (డీఈ)గా ప్రమోషన్ రానుందని సమాచారం. పదోన్నతిని అందుకునే ముందే మృత్యువు పలకరించడం తో సహోద్యోగులు, కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. ఆయన మరణం ఇరిగేషన్ శాఖలో విషాదాన్ని నింపింది.
నాగరాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలవాలని సహోద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆకస్మిక గుండెపోటుతో మరణించే సంఘటనలు పెరుగుతున్నాయని, ఉద్యోగస్తులు ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.