నార్సింగ్ మండలం నర్సంపల్లి, వల్లూరు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనకు వచ్చిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. కేపిఆర్ గో బ్యాక్, కేపీఆర్ ఖబర్దార్ అంటూ స్థానికులు నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఆయన హాజరైన కార్యక్రమాలను అడ్డుకునేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించారు.
మీడియా సమావేశంలో కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ, నార్సింగ్ మండల అభివృద్ధికి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి కొండా సురేఖ నిధులు మంజూరు చేశారని, కానీ ఎమ్మెల్యే కేపిఆర్ శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ భవనాన్ని ఇప్పటికే ప్రారంభించినా, దాన్ని మళ్లీ ప్రారంభించడం విడ్డూరమని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పేదల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టామని, అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతున్నామని నేతలు తెలిపారు. ప్రభుత్వ నిధులతో చేపట్టిన పనులను తమ ఖాతాలో వేసుకోవడం ప్రజలకు అర్థమవుతుందని మండిపడ్డారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సత్యనారాయణ, మాజీ టెలికాం బోర్డు మెంబర్ రాజేష్, కాంగ్రెస్ నాయకులు బాలరాజు గౌడ్, టీపీసీసీ సేవాదళ్ కార్యదర్శి యాదగిరి యాదవ్, ఎస్సీ సెల్ జిల్లా నాయకులు గోవర్ధన్, మైనార్టీ నేతలు రఫిక్, బాచి, చందు యాదవ్, రాజు గౌడ్, కేశవ్ తదితరులు పాల్గొన్నారు.