కెనడా ప్రధాని, లిబరల్ పార్టీ అధ్యక్షుడు జస్టిన్ ట్రూడో రాజీనామా చేయనున్నారనే ప్రచారం వేగంగా వ్యాపిస్తోంది. లిబరల్ పార్టీలో ట్రూడోపై తీవ్ర వ్యతిరేకత నెలకొనడంతో పాటు, వచ్చే ఎన్నికల్లో గెలవలేమనే అభిప్రాయం ఉన్న నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ నెల 8న లిబరల్ పార్టీ కాకస్ మీటింగ్ జరగనుంది. ఈ మీటింగ్ కు ముందు ట్రూడో రాజీనామా చేస్తారని వార్తలు వస్తున్నాయి.
ట్రూడో రాజీనామాకు కారణం పార్టీలో ఆయనపై విశ్వాసం తగ్గడమేనని, మీటింగ్ లో అవమానకరంగా తొలగింపబడే పరిస్థితి తలెత్తకుండా ముందు జాగ్రత్తగా ఆయన తప్పుకుంటున్నారని తెలుస్తోంది. తాత్కాలిక అధ్యక్షుడిగా ఆర్థిక మంత్రి డొమినిక్ లెబ్లాంక్ బాధ్యతలు చేపట్టే అంశంపై ట్రూడో చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కెనడా మీడియా కథనాలను వెలువరించింది.
ట్రూడో రాజీనామా చేస్తే, ప్రధానిగా కొనసాగుతారా లేదా ఆ పదవికీ రాజీనామా చేస్తారా అన్నది ఇంకా స్పష్టత లేదు. అయితే లిబరల్ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, కన్జర్వేటివ్ పార్టీ ముందంజలో ఉందని ప్రచారం జరుగుతోంది. అక్టోబర్ లో జరగనున్న ఎన్నికల నాటికి పార్టీకి శాశ్వత నాయకత్వాన్ని ఎన్నుకోవడం అసాధ్యమని విశ్లేషకులు అంటున్నారు.
తాత్కాలిక నాయకత్వంలో ఎన్నికలకు వెళ్లడం లిబరల్ పార్టీకి మైనస్ కానుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ట్రూడో రాజీనామా నిర్ణయం పార్టీపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతుందని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.