రాజమౌళి .. తెలుగు సినిమాకు చిరస్మరణీయమైన పేరు. ప్రతి సినిమా సంచలన విజయాలను అందించిన ఆయన, ఇప్పుడు మహేశ్ బాబుతో ఓ స్పెషల్ ప్రాజెక్ట్ చేయనున్నారు. ‘RRR’ తర్వాత రాజమౌళి చేయనున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మహేశ్ బాబు ఈ చిత్రానికి ప్రత్యేక లుక్ కోసం కసరత్తు చేస్తున్నారు.
రాజమౌళి కెరీర్ చూస్తే ఆయన ప్లానింగ్, నైపుణ్యంతో సినిమాలకు కొత్త దిశను చూపారు. ‘సింహాద్రి’ నుంచి ‘బాహుబలి’ వరకు మాస్ యాక్షన్, ఫాంటసీ, జానపద చిత్రాలతో ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేశారు. ‘బాహుబలి’తో తెలుగు సినిమా జెండాను ప్రపంచ స్థాయిలో ఎగరవేశారు.
ప్రేక్షకులు కొంతకాలంగా అడవి నేపథ్యంతో రాజమౌళి ఒక సినిమా చేయాలని ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఆ ఆశను నెరవేర్చేలా ఆయన కథ ‘అమెజాన్’ అడవుల నేపథ్యంలో రూపుదిద్దుకుంది. నిధి తాలూకు వేటతో కూడిన యాక్షన్ అడ్వెంచర్ ఈ సినిమా కథ. అడవులు, గుహలు, జలపాతాలు వంటి ప్రకృతి అద్భుతాలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
ఈ నెల చివరినుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రం, మహేశ్ బాబు కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది. అద్భుతమైన విజువల్స్‌తో పాన్-ఇండియా స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించనుంది.