కర్నూలు జిల్లా ఆదోని ప్రాంతంలో మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు నిలిపివేయడం పట్ల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైకాపా ప్రభుత్వం ఆదోని జనరల్ హాస్పిటల్‌కు కేటాయించిన 200 మంది వైద్యులు, సిబ్బందిని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం వివాదాస్పదంగా మారింది.
మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి రైతులతో చర్చించి మెడికల్ కాలేజీ నిర్మాణానికి స్థలాన్ని పొందించారు. ప్రభుత్వ ఒత్తిడి ద్వారా రూ. 500 కోట్లు మంజూరు చేయించి 30 శాతం పనులు పూర్తిచేశారు. ఇప్పుడు పనులు నిలిచిపోవడం వల్ల ఆదోని ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో లేకుండా పోయాయి.
ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన ఎమ్మెల్యే పార్థసారథి నిధులు లేవని ప్రకటించడం ప్రజల్లో అసంతృప్తి కలిగించింది. ఆయన మాటలు తప్ప చర్యలు ఏవీ లేకపోవడం పై ప్రజలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని అడ్డుకోవాలని, ఎమ్మెల్యే ప్రజల తరపున ప్రత్యక్ష ఆందోళన చేపట్టాలని సీనియర్ జర్నలిస్టు తెలుగు ఈరన్న కోరారు.
ఆదోనిలో ఉన్న రాజకీయ పార్టీలు, వ్యాపారులు, ప్రజలు కలిసి ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకువెళ్ళి మెడికల్ కాలేజీ పనులు పూర్తిచేయించి, రద్దు చేసిన వైద్య సిబ్బందిని తిరిగి నియమించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజల ఆరోగ్య హక్కుల పట్ల ప్రభుత్వమే కాకుండా స్థానిక నాయకులు కూడా చిత్తశుద్ధితో వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు.