ఈ ఏడాది బ్యాంకు రుణాలను ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరస్థుల నుంచి కేంద్రం 22,280 కోట్లు వసూలు చేసిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో వెల్లడించారు. ఈ రకంగా, విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ వంటి ఆర్థిక నేరస్థుల నుంచి పెద్ద మొత్తంలో రాబడిని వసూలు చేయగలిగారు.
విజయ్ మాల్యాకు చెందిన దేశంలో ఉన్న ఆస్తులను వేలం వేసి రూ.14 వేల కోట్లు బ్యాంకులకు జమ చేసినట్లు వివరించారు. అలాగే, గుజరాత్ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ ఆస్తుల్ని అమ్మి 1,000 కోట్లు వసూలు చేసినట్లు ప్రకటించారు. ఈ నిధులు బ్యాంకులకు చేరాయని, దీనిలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు.
ఈడీ అటాచ్ చేసిన ఆస్తులను వీటి కోసం ప్రత్యేకంగా ఏర్పడిన ముంబై స్పెషల్ కోర్టు ఆదేశాలతో వేలం వేసి బ్యాంకులకు నగదు జమ చేశారు. మొత్తం 7 వేల కోట్లు మరింత ఎగవేతదారుల నుంచి వసూలు చేసినట్లు తెలిపారు. ఈ ప్రక్రియలో, ఈడీ, బ్యాంకులు సంయుక్తంగా పని చేశాయి.
ఇక, మెహుల్ చోక్సీకి చెందిన రూ.2,566 కోట్ల విలువైన ఆస్తులను కూడా ఈడీ జప్తు చేసింది. ఈ ఆస్తులను కూడా స్పెషల్ కోర్టు ఆదేశాలతో వేలం వేసేందుకు అనుమతిచ్చింది. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు చెల్లించాల్సిన రుణాలు చోక్సీ చెల్లించలేదు, దీంతో జప్తు చేసిన ఆస్తులను అమ్మి, రుణదాతలకు చెల్లించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.