చీరాల పురపాలక సంఘంలో సుమారు 20 మంది పారిశుధ్య కార్మికులు తమ విధులను పక్కనపెట్టి సానిటరీ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు వ్యక్తిగత అవసరాలకు పని చేయాల్సి రావడం పెద్ద దుమారానికి దారితీసింది. కార్మికులను రహదారుల పరిశుభ్రత మరియు కార్యాలయ అవసరాల కోసం వినియోగించాల్సి ఉండగా, తన సొంత ఇంటి పనులకు వినియోగిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.
ఇన్స్పెక్టర్ సొంత ఇంటి పనులకు పారిశుధ్య కార్మికులను తగిలించుకుంటూ వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధిత కార్మికులు వాపోయారు. తాము తప్పని పరిస్థితుల్లో ఆ పనులు చేయాల్సి వచ్చిందని, పని చేయకపోతే ఇన్స్పెక్టర్ సమస్యలు సృష్టిస్తానని బెదిరించారని కార్మికులు పేర్కొన్నారు.
తమ ఉద్యోగానికి విరుద్ధంగా వ్యక్తిగత పనులకు బలవంతంగా ఉపయోగించడం పట్ల తోటి కార్మికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇన్స్పెక్టర్ చేష్టలు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని, ఇలాంటి అన్యాయాలకు పాల్పడే అధికారులను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పురపాలక సంఘం పారదర్శకత, కార్మికుల హక్కులు రక్షణ పొందేందుకు అధికారులు దృష్టి పెట్టాలని అభ్యర్థించారు.