పిఠాపురం సోషల్ వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్‌లో రదాలపేటకు చెందిన పూడి గంగాధర్ అలియాస్ బాలు, కుమారపుర గ్రామానికి చెందిన గుబ్బల దయానంద పాలు మద్యం మత్తులో హాస్టల్‌లోకి చొరబడి 8, 9, 10 తరగతి విద్యార్థులను బెదిరించారు. బీరు సీసాలతో భయపెట్టి పిల్లల వద్ద ఉన్న రూ. 540 లు దోచుకున్నారు. ఈ సంఘటనతో హాస్టల్ వార్డెన్ ఫిర్యాదు మేరకు పిఠాపురం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయబడింది.
పోలీసులు తక్షణమే స్పందించి, రెండు నిందితులను అరెస్టు చేశారు. విచారణలో వారు మద్యం మత్తులో హాస్టల్ గోడ దాటి లోపలికి ప్రవేశించి, విద్యార్థులను భయపెట్టి డబ్బులు లూటీ చేశారని తేలింది. నిందితులను ఈరోజు పిఠాపురం కోర్టులో హాజరుపరిచారు.
పట్టణంలోని చెడు ప్రవర్తన కలిగిన యువతకు పోలీసు శాఖ హెచ్చరిక జారీచేసింది. స్కూల్స్, కాలేజీలు, హాస్టల్స్‌లో మద్యం సేవించడం, చట్ట వ్యతిరేక పనులు చేయడం పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అలాంటి వ్యక్తులపై రౌడీషీట్లు కూడా తెరుస్తామని పోలీసు అధికారులు స్పష్టం చేశారు. హాస్టల్ పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకుని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు.