గుంటూరు జిల్లా కాకుమాను మండలం గరికపాడు గ్రామంలో డ్వాక్రా గ్రూపుల్లో జరిగిన అవినీతి మరోసారి వెలుగులోకి వచ్చింది. గత ఏపీఎం తాడికొండ సోమశేఖర్, సీసీ సుబ్బారావు, యానిమేటర్ మంచాల జ్యోతి చేతివాటంతో దాదాపు కోటి రూపాయలు మేర అవినీతి జరిగింది. సభ్యులు అప్పులు చెల్లించడంలో నిబంధనలకు విరుద్ధంగా పెద్ద మొత్తాలను కట్టించారు.
యానిమేటర్ మంచాల జ్యోతి తనపై ఉన్నతాధికారుల ఒత్తిడి కారణంగా ఈ చర్యలకు పాల్పడాల్సి వచ్చిందని వెల్లడించారు. గత ప్రభుత్వంలో కొందరి అండతో ఈ అవినీతి కొనసాగిందని, బాధిత సభ్యులు కోర్టుకి ఫిర్యాదు చేసినప్పటికీ, కఠిన చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు.
ప్రస్తుత ప్రభుత్వంలో డ్వాక్రా లోన్ల అవినీతిపై దృష్టి పెట్టి, ఇలాంటి ఘటనలు తిరిగి జరగకుండా చర్యలు తీసుకోవాలని సభ్యులు కోరుతున్నారు. గరికపాడు గ్రామంలోనే కోటి రూపాయల అవినీతి బయటపడటంతో, మిగిలిన 17 గ్రామాలలో ఎంత అవినీతి జరిగిందో అనుమానం వ్యక్తం చేశారు.
సభ్యులు తమకు జరిగిన ఆర్థిక నష్టాన్ని పూడ్చే విధంగా డబ్బులను రికవరీ చేయాలని, బాధ్యులైన అధికారులను విధుల నుంచి తొలగించి కఠిన శిక్షలు విధించాలని డ్వాక్రా సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.