కాకినాడ జిల్లా పిఠాపురంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పిఠాపురం మున్సిపాలిటీ ఆవరణలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సంఘాలు ఐక్యంగా నివాళులర్పించాయి. ఈ కార్యక్రమంలో దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి సాకారామకృష్ణ, ఆంధ్ర మాల మహానాడు జిల్లా అధ్యక్షులు ఎం ఎమ్, జిల్లా కన్వీనర్ వీ. రాంబాబు, లోడ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వారు ఆయన సేవలను గుర్తుచేసుకున్నారు. డాక్టర్ అంబేద్కర్ సమాజంలో సమానత్వం, లౌకిక సామ్యవాద దేశంగా భారతదేశ అభివృద్ధి కోసం చట్టాలు, హక్కులు, రిజర్వేషన్లు రూపొందించిన గొప్ప నాయకుడిగా వారు కొనియాడారు. ఇలాంటి మహా వ్యక్తి జ్ఞాపకార్థం వర్ధంతులను నిర్వహించడం భారతీయుల బాధ్యత అని వారు పేర్కొన్నారు.
ఇటీవలి కాలంలో తిరుపతి వి.ఎస్.యూనివర్సిటీ ప్రొఫెసర్ జంగయ్యపై జరిగిన దాడిని ఖండిస్తూ, దాడికి పాల్పడిన బజరంగదళ్ గుండాలపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అంబేద్కర్ ఆశయాల మేరకు సామాజిక న్యాయం కొనసాగించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రాజ్యాంగ పరిరక్షణపై ఈనెల 8న జరగనున్న జిల్లా సదస్సుకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. రిక్షా కార్మికులు, ఆటోరంగ కార్మికులు, దళిత నాయకులు, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని డాక్టర్ అంబేద్కర్ సేవలను స్మరించుకున్నారు.