నల్గొండ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 7న పర్యటించనున్నారు. రోడ్లు భవనాల, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వివరాలు వెల్లడించారు. నల్గొండ పట్టణంలో మెడికల్ కాలేజ్‌ను ప్రారంభిస్తారని, అలాగే నకిరేకల్ నియోజకవర్గంలో బ్రాహ్మణ వెల్లంల సాగునీటి ప్రాజెక్టును ప్రారంభిస్తారని తెలిపారు.
ఈ ప్రాజెక్టు ప్రారంభంతోపాటు మరో రూ. 500 కోట్ల వ్యయంతో చేపట్టిన కెనాల్స్ నిర్మాణానికి కూడా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు ద్వారా నల్గొండ, నకిరేకల్, మునుగోడు నియోజకవర్గాలకు సాగునీరు అందుతుందని, గత టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఈ ప్రాజెక్టు పట్టుబడిందని ఆరోపించారు.
ప్రజా ప్రభుత్వం ఏర్పడిన ఒకే సంవత్సరంలో ప్రాజెక్టును పూర్తి చేయడం గర్వకారణమని తెలిపారు. నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు వద్ద ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.
మెడికల్ కాలేజ్ ప్రారంభోత్సవానికి మరియు ప్రాజెక్టు కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లను ఎమ్మెల్యేలు వేముల వీరేశం, భక్తుల లక్ష్మారెడ్డి, జిల్లా కలెక్టర్ త్రిపాఠితో కలిసి మంత్రి పరిశీలించారు. అధికారులతో సమీక్ష నిర్వహించి ఏర్పాట్లపై ఆదేశాలు జారీ చేశారు.