భోపాల్ లో 1984 డిసెంబర్ 2 అర్ధరాత్రి నుండి 3,800 మంది ప్రాణాలు కోల్పోయిన గ్యాస్ లీక్ దుర్ఘటనకు 40 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఆ సమయంలో యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీలో లీకైన విష వాయువు నగరాన్ని దాటి సమీప ప్రాంతాలకి వ్యాపించింది. ఈ విషవాయువు కారణంగా భోపాల్ లో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ అక్కడి ప్రజలపై దీని దుష్ప్రభావాలు కొనసాగుతూనే ఉన్నాయి, చాలా మంది శారీరకంగా బాధపడుతున్నారు.
ఈ దుర్ఘటనకు సంబంధించిన విష రసాయన వ్యర్థాలను యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ ఆవరణలో జాగ్రత్తగా నిల్వ చేశారు. ప్రస్తుతం ఈ వ్యర్థాలను తొలగించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఫ్యాక్టరీ ఆవరణలోని 377 టన్నుల వ్యర్థాలను తొలగించి పిథంపూర్ ఇండస్ట్రియల్ ఏరియాకు తరలించడం మొదలు పెట్టారు. ఈ వ్యర్థాలను ఇంజనీరింగ్ నిపుణుల ఆధ్వర్యంలో ధ్వంసం చేయాలని అధికారులు నిర్ణయించారు.
బుధవారం రాత్రి, విషపూరిత రసాయన వ్యర్థాలను 12 సీల్డ్ కంటైనర్లలో లోడ్ చేసి, వంద మంది కార్మికులు షిఫ్టుల వారీగా పనిచేశారు. అనంతరం వీటిని 250 కిలోమీటర్ల దూరంలోని పిథంపూర్ కు తరలించారు. ట్రాఫిక్ పోలీసుల సహాయంతో ఈ వ్యర్థాలను జాగ్రత్తగా తరలించే గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేయబడింది.
పిథంపూర్ లో ఈ వ్యర్థాలను ధ్వంసం చేయడం 153 రోజులు పడుతుందని అధికారుల అంచనా. ఈ చర్యలు ఫ్యాక్టరీ ప్రాంతంలో ఉన్న ప్రమాదకరమైన వ్యర్థాలను తగిన విధంగా తొలగించి భోపాల్ ప్రజలకి ఒక నివారణను అందిస్తాయని భావిస్తున్నారు.