ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో జరిగిన దారుణ ఘటన అందరిని షాక్‌కు గురిచేసింది. నాలుగేళ్ల చిన్నారి తన తండ్రే తల్లి హంతకుడని నిరూపించింది. ఝాన్సీ కొత్వాలి ప్రాంతంలో 27 ఏళ్ల వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. పోలీసులు విచారణ జరిపినప్పుడు చిన్నారి తన తండ్రి తల్లిని హత్య చేశాడని వెల్లడించింది. అంతేకాదు, డ్రాయింగ్ వేసి మరింత స్పష్టత ఇచ్చింది.
పోలీసుల కథనం ప్రకారం, 2019లో సందీప్ బుధోలియాతో బాధిత మహిళ వివాహమైంది. కట్నంగా రూ. 20 లక్షల నగదు ఇచ్చినప్పటికీ భర్త, అత్తమామలు అదనపు కట్నం కోసం వేధించేవారని ఆమె తండ్రి ఆరోపించాడు. ఇంటి నుంచి డబ్బులు తీసుకురాకపోవడంతో ఆమెను తీవ్రంగా చిత్రహింసలు పెట్టేవారని తెలిపారు. మొదట కుటుంబ సభ్యుల మధ్య రాజీ కుదిరినప్పటికీ, వేధింపులు మాత్రం ఆగలేదు.
ఆమెకు పాప పుట్టిన తర్వాతా వేధింపులు కొనసాగాయి. అబ్బాయి పుట్టలేదని భర్త, అత్తమామలు ఆమెను మానసికంగా హింసించేవారు. చివరికి ఆమె అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకుని కనిపించింది. పోలీసులు విచారణలో భాగంగా చిన్నారిని ప్రశ్నించగా ఆమె తండ్రే తల్లిని చంపాడని చెప్పింది. పైగా, తల్లిని ఎలా హత్య చేశాడో చిత్రంగా వేసి వివరించింది.
‘‘నాన్న అమ్మను కొట్టి ఉరివేశాడు. రాయితో తలపై కొట్టి గోనె సంచిలో పెట్టి పడేసాడు’’ అని చిన్నారి చెప్పడంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ప్రస్తుతం అతను జైలులో ఉన్నాడు. మిగతా నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది. చిన్నారి వాంగ్మూలం కేసును ఓ కొత్త మలుపు తిప్పింది.