భారత నౌకాదళం తన సామర్థ్యాన్ని పెంచుకునేందుకు కీలకమైన ఒప్పందం కుదుర్చుకుంది. ఫ్రాన్స్ నుంచి 26 రఫేల్ మెరైన్ (Rafale Marine) యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు భారత ప్రభుత్వం, ఫ్రాన్స్ మధ్య సోమవారం భారీ ఒప్పందం చేయడం జరిగింది. ఈ ఒప్పందం విలువ సుమారు రూ.63,000 కోట్లు. భారత రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్, ఫ్రాన్స్ ప్రతినిధులు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. నావీ వైస్ చీఫ్ అడ్మిరల్ కె. స్వామినాథన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ ఒప్పందం ప్రకారం, భారత నౌకాదళానికి 22 సింగిల్ సీట్ రఫేల్-ఎం జెట్స్, నాలుగు ట్విన్ సీట్ శిక్షణ విమానాలు అందనున్నాయి. ఈ విమానాలు భారత నౌకాదళం యొక్క స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ పై నుంచి పనిచేస్తాయి. కొద్దిరోజుల క్రితమే ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ ఒప్పందానికి ఆమోదం తెలిపింది.
ఇప్పటికే భారత వైమానిక దళం 36 రఫేల్ జెట్స్‌ను ఉపయోగిస్తున్న నేపథ్యంలో, లాజిస్టిక్స్, విడిభాగాలు, నిర్వహణలో సౌలభ్యం కూడా రఫేల్-ఎం ఎంపికకు సహాయపడింది. ఈ విమానాలు సముద్ర లక్ష్యాలపై దాడులు, వాయు రక్షణ, నిఘా వంటి బహుళ ప్రయోజనకరమైన పనులను చేపట్టగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. రఫేల్ యుద్ధ విమానాల్లో అణ్వాయుధాలను ప్రయోగించే సామర్థ్యం కూడా ఉంది.
ప్రస్తుతం నౌకాదళం వద్ద రష్యా నుంచి 2009 తర్వాత కొనుగోలు చేసిన మిగ్-29కె యుద్ధ విమానాలు కొన్ని నిర్వహణ సమస్యలతో ఇబ్బంది పడుతున్నాయి. ఈ పరిస్థితిలో, స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేస్తున్న ట్విన్ ఇంజిన్ డెక్ బేస్డ్ ఫైటర్ (TEDBF) వచ్చే దశాబ్దంలో పూర్తయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో, నౌకాదళం ఈ 26 రఫేల్-ఎం జెట్స్ కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈ కొత్త యుద్ధ విమానాలతో భారత నౌకాదళం సముద్రంలో మరింత పటిష్టతను పొందనుంది.