ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. చేనేత రంగంలో పెట్టుబడులు ఆకర్షించేందుకు ఐదు సంస్థలు ముందుకు వచ్చాయని, ఈ సంస్థలు రూ.2,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయని చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు. త్వరలో ఈ సంస్థలతో ఎంవోయూలు చేసుకోవాలని నిర్ణయించామని, వాటి ద్వారా 15 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని చెప్పారు.
న్యూఢిల్లీలో నిర్వహించిన ఇంటర్నేషనల్ భారత్ టెక్స్-2025 ఎగ్జిబిషన్‌లో మంత్రి సవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశ, విదేశీ పెట్టుబడిదారులతో సమావేశమై, ఏపీలో పరిశ్రమల అభివృద్ధి గురించి వివరించారు. అడ్వాన్స్ టెక్స్ టైల్స్ అసోసియేషన్, ఐటీఎంఎఫ్, మాస్కో ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ సహా మరో రెండు సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించాయని తెలిపారు. కర్ణాటకకు చెందిన కంపెనీలు ఎమ్మిగనూరు టెక్స్ టైల్స్ పార్క్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి వ్యక్తం చేశాయని వెల్లడించారు.
రష్యాలో టెక్స్‌టైల్స్ వేర్‌హౌస్ ఏర్పాటుకు గుంటూరు టెక్స్‌టైల్స్ పార్క్ అంగీకారం తెలిపిందని మంత్రి సవిత చెప్పారు. భారత్ టెక్స్-2025 ఎగ్జిబిషన్ విజయవంతంగా ముగిసిందని, 126 దేశాల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నట్లు తెలిపారు. చేనేత రంగంలో పెట్టుబడులకు, మార్కెటింగ్ అవకాశాలకు ఈ ఎగ్జిబిషన్ దోహదపడిందని చెప్పారు. ‘ఖాదీ ఈజ్ ఏ నేషన్… ఖాదీ ఈజ్ బీకమింగ్ ఫ్యాషన్’ అంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు ఎంతో స్ఫూర్తినిచ్చాయని పేర్కొన్నారు.
భారత్ టెక్స్ విజయాన్ని దృష్టిలో ఉంచుకొని, త్వరలో ఏపీలోనూ చేనేత పరిశ్రమకు పెట్టుబడులు ఆకర్షించేలా ప్రత్యేక సదస్సు నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం కల్పించామని, చేనేత పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన రాయితీలు, సౌకర్యాలు అందిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏపీ చేనేత జౌళి శాఖ కమిషనర్ రేఖారాణి, ఆప్కో ఎండీ పావనమూర్తి, ఇతర అధికారులు పాల్గొన్నారు.