కేరళలోని ఎన్నాకుళం జిల్లా త్రిప్పునితురలో దారుణం చోటుచేసుకుంది. గ్లోబల్ పబ్లిక్ స్కూల్ విద్యార్థి మిహిర్, ర్యాగింగ్‌ను తట్టుకోలేక భవనం 26వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. జనవరి 15న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మిహిర్‌పై అమానవీయంగా ప్రవర్తించిన తోటి విద్యార్థులు అతడిని తీవ్రంగా అవమానించారని తల్లి రాజ్నా తెలిపారు.
తన కుమారుడి ఆత్మహత్య వెనుక ఉన్న నిజాన్ని వెలికితీయడానికి మిహిర్ తల్లిదండ్రులు ప్రయత్నించారు. స్కూల్‌లోని విద్యార్థులు, స్నేహితుల ద్వారా ర్యాగింగ్ ఘటన గురించి వివరాలు సేకరించారు. చివరకు మిహిర్ సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించగా, అందులో ఊహించని నిజాలు బయటపడ్డాయి. స్కూల్‌లోనే కాకుండా, స్కూల్ బస్సులో కూడా అతడిని ముఠా సభ్యులు వేధించారని తల్లి వెల్లడించారు.
ర్యాగింగ్ గ్యాంగ్ మిహిర్‌ను శారీరకంగా, మానసికంగా హింసించడంతో పాటు, అతడి శరీర రంగుపై కూడా వ్యాఖ్యలు చేశారు. మరణం తర్వాత కూడా వారే అతడిని అవమానిస్తూ సందేశాలు పంపారని తల్లి పేర్కొన్నారు. మిహిర్ మరణాన్ని సోషల్ మీడియాలో సెలబ్రేట్ చేసిన వారి మేసేజ్‌లు బయటపెట్టారు. తమ కుమారుడిని మృత్యువాత పడేలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరారు.
ఈ ఘటనపై త్రిప్పునితుర పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అయితే, మిహిర్ తల్లి చేసిన ఆరోపణలను గ్లోబల్ పబ్లిక్ స్కూల్ ఖండించింది. స్కూల్‌లో ఇలాంటి ఘటనలు జరుగుతాయని అనుకోవడం తప్పుడు ప్రచారమని పేర్కొంది. కానీ మిహిర్ తల్లిదండ్రులు తమ సేకరించిన ఆధారాలతో నిజమైన న్యాయం కోసం పోరాడుతున్నారు.