ఏజెన్సీ రంపచోడవరం నియోజకవర్గం వై రామవరం మండలం తోటకూర పాలెం గ్రామంలోని కస్తూరిబాయి బాలికల ఆశ్రమ పాఠశాల, కళాశాలలో 14 మంది విద్యార్థినులు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. గురువారం ఈ ఘటన జరగగా, విద్యార్థులను వెంటనే చవిటి దిబ్బల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి వైద్యం అందించారు.
కేజీబీవీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగిందని పుకార్లు వ్యాపించాయి. దీంతో ఏజెన్సీలో ఆందోళన నెలకొంది. అయితే వైద్యులు పరీక్షించి, ఇది ఫుడ్ పాయిజన్ కాదని నిర్ధారించారు. 14 మంది విద్యార్థులలో 8 మంది వాంతులతో, నలుగురు విరోచనాలతో బాధపడగా, మరో ఇద్దరు గజదిబ్బల కారణంగా అస్వస్థతకు గురైనట్లు చెప్పారు.
అస్వస్థతకు గురైన విద్యార్థులలో 8వ తరగతి ఆరుగురు, 6వ తరగతి నలుగురు, ఇంటర్మీడియట్ చదువుతున్న ఇద్దరితోపాటు 7, 9, 10వ తరగతుల విద్యార్థులు ఉన్నారు. పరీక్షల అనంతరం, పరిశుభ్రత లోపం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని వైద్యులు పేర్కొన్నారు.
పాఠశాల పరిసరాలను పరిశీలించిన వైద్యులు, పారిశుద్ధ్యం, త్రాగునీరు, వ్యక్తిగత పరిశుభ్రతపై యాజమాన్యం తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పిల్లల ఆరోగ్య భద్రతపై మరింత జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.
