శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో ఓ ప్రైవేట్ పాఠశాలలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జీనియస్ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న ముగ్గురు చిన్నారులు హోం వర్క్ చేయలేదన్న కారణంతో ఉపాధ్యాయురాలు అనిత మానవత్వాన్ని మరిచి వారిని చెప్పుతో కొట్టింది. పిల్లలపై శారీరక దాడికి దిగిన ఉపాధ్యాయురాలి చర్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ఈ విషయం తెలిసిన బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు వెంటనే పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయురాలిని నిలదీశారు. ఆమె చేసిన దుశ్చర్యపై శబ్దం పెంచి గొడవకు దిగారు. అనితను ప్రశ్నించడమే కాకుండా కొందరు తల్లిదండ్రులు ఆమెపై దాడికి కూడా దిగారు. దీనితో పాఠశాల ఆవరణలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.
సమాచారం తెలుసుకున్న వన్‌టౌన్ పోలీసులు తక్షణమే పాఠశాలకు చేరుకుని పరిస్థితిని సమీక్షించి అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటన పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, పిల్లల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తారు. పాఠశాల యాజమాన్యం మాత్రం ఈ వ్యవహారాన్ని తేలిగ్గా తీసుకునే ప్రయత్నం చేసింది.
ఈ ఘటనపై స్పందించిన ఎంఈవో గోపాల్ నాయక్ విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక పంపుతామని తెలిపారు. పిల్లలపై శారీరకంగా దాడిచేసే ఉపాధ్యాయులకు తగిన శిక్ష విధించాలని, మానవీయ విలువలు నేర్పాల్సిన టీచర్లే ఇలాంటివి చేయడం బాధాకరమని పలువురు అభిప్రాయపడ్డారు.