అమెరికాలోని షికాగో నగరంలో ఓ రెస్టారెంట్‌లో జరిగిన కాల్పులు తీవ్ర కలకలం రేపాయి. ఆదివారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, కనీసం 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన స్థానికంగా ఆందోళనకు గురిచేసింది.
పోలీసుల కథనం ప్రకారం, ఈ కాల్పులు ఓ ప్రైవేట్ పార్టీ అనంతరం జరిగాయి. స్థానికంగా గుర్తింపు పొందిన ఓ ర్యాప్ గాయకుడు (ర్యాపర్) తన ఆల్బమ్ విడుదల సందర్భంగా ఓ రెస్టారెంట్‌లో పార్టీ ఏర్పాటు చేశారు. పార్టీలో అతడి మిత్రులు, అభిమానులు హాజరయ్యారు. మద్యం, సంగీతం, డ్యాన్స్‌తో కార్యక్రమం రాత్రంతా సందడిగా సాగింది. అయితే పార్టీ ముగిశాక రాత్రి 1:30 గంటల సమయంలో అతిథులు బయటకు వస్తున్న సమయంలో ఓ గుర్తుతెలియని దుండగుడు అక్కడికి చేరి విచక్షణ రహితంగా కాల్పులకు తెగబడ్డాడు.
కాస్తలోనే అక్కడ ఎవరూ ఏమవుతుందో అర్థం చేసుకోకముందే కాల్పుల శబ్దాలు చుట్టూ మార్మోగాయి. జనాలు పరుగులు పెట్టడం, కేకలు వేయడం మొదలయ్యాయి. దీనివల్ల తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఆ దుండగుడు నేరుగా జన సమూహంపై కాల్పులు జరిపి, వెంటనే కారులో ఎక్కి పారిపోయాడు. పోలీసుల ప్రకారం, మొత్తం 18 మందిపై కాల్పులు జరిపారు. వీరిలో 13 మంది మహిళలు, 5 మంది పురుషులు ఉన్నారు.
ఈ దారుణ ఘటనలో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు మృతి చెందారు. మృతుల వయసు 21 నుంచి 32 సంవత్సరాల మధ్యగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. గాయపడినవారిని తక్షణమే సమీపంలోని ఆసుపత్రులకు తరలించామని, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు. గాయపడినవారిలో పార్టీ నిర్వహించిన ర్యాపర్ కూడా ఉన్నట్లు స్థానిక మీడియా తెలిపింది.
ఈ ఘటనకు సంబంధించిన కొన్ని వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీడియోల్లో ప్రజలు పరుగులు పెడుతున్న దృశ్యాలు, కల్లోల పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. స్థానిక పోలీసు విభాగం ఈ ఘటనపై విచారణ ప్రారంభించింది. రెస్టారెంట్, పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. కాల్పులకు కారణమైన వ్యక్తిని గుర్తించే పనిలో నిపుణులు ఉన్నారు. కాల్పుల ముందు దుండగుడు ఎవరితోనైనా గొడవ పడ్డాడా? లేక ముందే ఉద్దేశపూర్వకంగా ఈ దాడికి ప్రణాళిక రచించారా? అన్న కోణాల్లో విచారణ జరుపుతున్నారు.
ఘటన అనంతరం రెస్టారెంట్ ముందు పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ ప్రాంత ప్రజలతో పోలీస్ అధికారులు మాట్లాడి వివరాలు సేకరిస్తున్నారు. ఘటన జరిగిన చోట గాయపడినవారి బంధువులు, స్నేహితులు చేరుకున్నారు. వారి రోదనలు అక్కడున్న వారందరినీ కలచివేశాయి.
అమెరికాలో ఈ తరహా కాల్పుల ఘటనలు తరచుగా జరుగుతున్నప్పటికీ, వాటి నివారణపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనకు మరింత విశేష సమాచారం పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.