పిడుగురాళ్ల పట్టణ పోలీస్ స్టేషన్‌లో సీఐ వెంకటరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికలు కోరం లేక వాయిదా పడ్డాయని, కొత్త తేదీలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిందని వివరించారు. ఈనెల 17, 18 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయని, అందులో పోలీసులకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
తాజాగా జరిగిన ఎన్నికలలో పోలీసులు కౌన్సిలర్లను కిడ్నాప్ చేశారని వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. 3, 4 తేదీల్లో కోరం లేకపోవడానికి పోలీసుల ప్రమేయం లేదని స్పష్టం చేశారు. కిడ్నాప్ ఆరోపణలపై తమ వద్ద ఎలాంటి ఫిర్యాదులు అందలేదని తెలిపారు. 29వ వార్డు కౌన్సిలర్ సైదావలి, 14వ వార్డు కౌన్సిలర్ బాలకాసి, 23వ వార్డు కౌన్సిలర్ భర్త శ్రీనివాసరావును పోలీసులు కిడ్నాప్ చేశారన్న ఆరోపణలు అసత్యమని తెలిపారు.
సంబంధిత కౌన్సిలర్లు స్వయంగా వీడియో విడుదల చేసి, తమను ఎవరూ కిడ్నాప్ చేయలేదని స్పష్టం చేశారని ఆయన చెప్పారు. వ్యక్తిగత పనుల నిమిత్తం పక్క ఊర్లకు వెళ్లిన కౌన్సిలర్లపై తప్పుడు ప్రచారం చేయడం అభ్యంతరకరమని అన్నారు. సోషల్ మీడియాలో కావాలని పోలీసులపై ఆరోపణలు చేస్తుండటం తగదని హెచ్చరించారు.
రాజకీయ విషయాల్లో పోలీసుల జోక్యం ఉండదని స్పష్టం చేశారు. తప్పుడు ఆరోపణలు చేసే వారిపై అధికారుల ఆదేశాల మేరకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ప్రజలు తప్పుడు ప్రచారాలను నమ్మకుండా, అధికారిక సమాచారం తెలుసుకుని నడుచుకోవాలని సీఐ వెంకటరావు కోరారు.