నారాయణఖేడ్ మండలంలోని అనంతసాగర్, సత్యగామా, అంత్వర్, జుక్కల్, చందాపూర్ గ్రామాల ప్రజలు తమ గ్రామాలకు రోడ్లు నిర్మించాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. రోడ్ల లేమితో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే పనులు ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరారు.
మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మాట్లాడుతూ, తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నిధులు మంజూరు చేయించినప్పటికీ, ఎన్నికల కోడ్ కారణంగా పనులు నిలిచిపోయాయని తెలిపారు. కొత్త ప్రభుత్వం ఏడాది గడిచినా ఇప్పటికీ పనులు ప్రారంభించలేదని, ప్రజల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం నియోజకవర్గ ఎమ్మెల్యే, ఎంపీలు ప్రజల సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రోడ్లను తక్షణమే నిర్మించాలని, లేదంటే ఎంపీ, ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాస్తారోకో వల్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడటంతో పోలీసులు మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి లక్ష్మీబాయి రవీందర్ నాయక్, మండల పార్టీ అధ్యక్షుడు పరమేష్, ఉపాధ్యక్షుడు నర్సింలు యాదవ్, మాజీ సర్పంచులు వెంకటేశం, రాజు, సల్మాన్, కృష్ణ, మాజీ ఎంపీటీసీ ముజామిల్, తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ నిరసనలో పాల్గొని ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు.