ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల జరిగిన దళిత యువకుడు హరి ఓం వాల్మీకి లించింగ్ ఘటనపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న తరుణంలో, ఈ కేసుకు సంబంధించి మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బాధితుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు సిద్ధమవగా, వారు ఆయనను కలిసేందుకు నిరాకరించడం కలకలం రేపుతోంది.
బాధితుడి సోదరుడు విడుదల చేసిన వీడియోలో, “మా కుటుంబ దుఃఖాన్ని రాజకీయంగా వాడుకోవద్దు. యోగి ప్రభుత్వ చర్యలతో మేము సంతృప్తిగా ఉన్నాం. మా సోదరుడి హంతకులు అరెస్టయినారు. రాహుల్ గాంధీ గానీ, ఇంకెవరైనా నేతలూ రాజకీయ ప్రయోజనాల కోసం రావడం మాకు ఇష్టం లేదు” అని స్పష్టం చేశారు.
రాహుల్ పర్యటనకు గంటల ముందు, విషాదాన్ని వాడుకుని రాజకీయ వ్యాపారం చేయొద్దు, వెనక్కి వెళ్లండి అనే బోర్డులు బాధితుడి ఇంటికి వెళ్లే దారుల్లో కనిపించడం, పరిస్థితిని మరింత ఉత్కంఠతరం చేసింది. రాహుల్ గాంధీ అక్కడికి రావొద్దంటూ ‘గో బ్యాక్’ పోస్టర్లు కూడా వెలిశాయి.
ఇకపోతే అక్టోబర్ 2న, రాయ్‌బరేలీ జిల్లా ఉంచహార్ ప్రాంతంలో, హరి ఓంను దొంగగా అనుమానించి కొందరు మతిస్థిమితి కోల్పోయినట్లుగా దాడి చేసి హత్య చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు 12 మంది అరెస్టు అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి, బాధితుడి కుటుంబానికి న్యాయం చేయడంలో చురుగ్గా వ్యవహరించిందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
ఈ క్రమంలో, హరి ఓం భార్య సంగీత, ఆమె తండ్రి, కుమార్తెతో కలిసి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కలవడం, అధికార పక్షం సానుభూతిని వ్యక్తం చేయడం జరిగింది. అలాగే ఉంచహార్ ఎమ్మెల్యే మనోజ్ పాండే వారిని స్వయంగా సీఎం వద్దకు తీసుకెళ్లారు. అలాగే మంత్రులు రాకేశ్ సచాన్, అసిమ్ అరుణ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి న్యాయాన్ని హామీ ఇచ్చారు.
ఇదిలా ఉండగా, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ రాయ్‌ను ప్రభుత్వం బాధితుల్ని కలిసేందుకు అనుమతించలేదని, పోలీసులు అడ్డుకుందని ఆరోపిస్తోంది. దీంతో ఆయన రోడ్డుపైనే ధర్నాకు దిగారు.
ఇప్పటికే శోకసంద్రంలో ఉన్న కుటుంబాన్ని వాడుకోవద్దన్న బాధితుల అభ్యర్థన, రాజకీయ నాయకుల సందర్శనలకు వ్యతిరేకత, మరియు ప్రభుత్వ హామీల నేపథ్యంలో ఈ వివాదం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది.
