మదనపల్లిలో గంజాయి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. డీఎస్పీ కొండయ్య నాయుడు మాట్లాడుతూ, జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు ప్రత్యేక దాడులు నిర్వహించామని తెలిపారు. రాయచోటి క్రైమ్ సీఐ చంద్రశేఖర్, మదనపల్లి పట్టణ సీఐలు రామచంద్ర, ఎరిసావల్లి, రూరల్ సీఐ సత్యనారాయణ, క్రైమ్ ఎస్ఐ రామకృష్ణారెడ్డి, ఐడి పార్టీ సిబ్బందితో కలిసి పోలీసులు గురువారం మధ్యాహ్నం వైఎస్ఆర్ కాలనీ సమీపంలోని మసీదు వద్ద తనిఖీలు నిర్వహించారు.
అనుమానాస్పద స్థితిలో ఉన్న ముగ్గురిని పరిశీలించగా, వారి వద్ద ఉన్న బ్యాగుల్లో 20 కిలోల గంజాయి లభించిందని డీఎస్పీ తెలిపారు. స్వాధీనం చేసుకున్న గంజాయికి మార్కెట్ విలువ రూ. 2.5 లక్షలు ఉంటుందని అంచనా. పోలీసులు నిందితులను స్టేషన్‌కు తరలించి విచారణ జరిపి, శనివారం వారిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.
అరెస్టైన వారిలో మదనపల్లె గురుకుల పాఠశాల సమీపంలోని లక్ష్మీ నగర్‌కు చెందిన ఆవుల చెవిటోడు అలియాస్ వెంకటేశ్వర్లు భార్య ఆవుల భాగ్య అలియాస్ భాగ్యమ్మ (31), ఆవుల అనిల్ (27), ఆవుల శివమ్మ (25) ఉన్నారని పోలీసులు వెల్లడించారు. వీరు ముఠాగా ఏర్పడి గంజాయి విక్రయిస్తుండగా పట్టుకున్నామని డీఎస్పీ తెలిపారు.
ఈ ముఠా గంజాయి సరఫరా నెట్‌వర్క్‌లో కీలకంగా వ్యవహరించిందని పోలీసులు తెలిపారు. గంజాయి నిల్వలు, సరఫరా మార్గాలను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపరిచిన అనంతరం రిమాండ్‌కు తరలించామని పోలీసులు వెల్లడించారు.
