ప్రపంచవ్యాప్తంగా రేబిస్ మహమ్మారి కారణంగా ప్రతి 9 నిమిషాలకు ఒకరు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ దారుణ పరిస్థితిలో మూడింట ఒకటి కేసులు భారత్‌లోనే నమోదవడం దేశంలో రేబిస్ ప్రమాదాన్ని తీవ్రతరం చేస్తోంది. దేశంలో వీధికుక్కల సంఖ్య కోట్లు దాటడం రేబిస్ వ్యాప్తికి ప్రధాన కారణంగా నిలుస్తోంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) విడుదల చేసిన తాజా గణాంకాలు చాలా ఆందోళన కలిగిస్తున్నాయి. సెప్టెంబర్ 28న జరుపుకునే ప్రపంచ రేబిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని డబ్ల్యూహెచ్‌ఓ ముఖ్య సూచనలు చేసింది. కుక్కలకు సామూహికంగా వ్యాక్సిన్లు వేసి, కుక్క కరిచిన వెంటనే బాధితులకు పోస్ట్-ఎక్స్‌పోజర్ ప్రోఫైలాక్సిస్ (పీఈపీ) చికిత్స అందించడం ద్వారా రేబిస్ వ్యాప్తిని అరికట్టవచ్చని స్పష్టం చేసింది. అనేక దేశాల్లో 70 శాతం కుక్కలకు వ్యాక్సినేషన్ పూర్తిచేయడం ద్వారా ఈ వ్యాధిని నియంత్రించిన ఉదాహరణలను గుర్తు చేసింది.
భారతదేశంలో ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ (ఐడీఎస్‌పీ) 2024 సంవత్సరంలో 37 లక్షల కుక్కకాటు కేసులు నమోదు చేసినట్లు, అలాగే 54 అనుమానిత రేబిస్ మరణాలు సంభవించాయని వివరించింది. 2023లో 286 మంది రేబిస్ కారణంగా ప్రాణాలు కోల్పోగా, ఈ గణాంకాలను పశు సంరక్షణ, డెయిరీ శాఖ (డీఏహెచ్‌డీ) సమర్పించింది.
ఇలాంటి పరిస్థితుల్లో భారత ప్రభుత్వం 2030 నాటికి రేబిస్‌ను పూర్తిగా నిర్మూలించే లక్ష్యంతో పని చేస్తున్నది. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. జాతీయ రేబిస్ నియంత్రణ కార్యక్రమం (ఎన్‌ఆర్‌సీపీ) ద్వారా ప్రజల్లో అవగాహన పెంచడం, వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచడం వంటి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
రేబిస్ నిర్మూలనకు తీసుకుంటున్న ఈ చర్యలు దేశంలో ఆరోగ్య భద్రతకు మద్దతుగా ఉంటాయని, సమగ్ర ప్రయత్నాల ద్వారా రేబిస్ వ్యాధిని అదుపులోకి తీసుకోవచ్చని నిపుణులు అంటున్నారు.
