బంగారం, బంగారు ఆభరణాల విక్రయాల్లో మోసాలు ఆగడం లేదు. పశ్చిమ గోదావరిలో కొంతమంది వ్యాపారులు సొంతంగా హాల్‌మార్క్ ప్రింటింగ్ యంత్రాలు ఏర్పాటు చేసుకుని నకిలీ ముద్రలతో కొనుగోలుదారులను మోసం చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది.
శ్రీకాకుళం సంఘటన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా నగల దుకాణాల్లో విక్రయించే ఆభరణాలపై ఆరు అంకెల ఆల్ఫాన్యూమరిక్ HUID కోడ్ తప్పనిసరి చేయాలని బీఐఎస్ హాల్‌మార్కింగ్ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. బీఐఎస్ నిబంధనల ప్రకారం ప్రతి ఆభరణంపై బీఐఎస్ లోగో, బంగారం స్వచ్ఛత (KDM), HUID కోడ్ తప్పనిసరిగా ఉండాలి.
కస్టమర్లు BIS Care యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా హాల్‌మార్క్ నంబర్‌ను వెరిఫై చేస్తే, ఆభరణం తయారీ స్థలం, వ్యాపారి వివరాలు, హాల్‌మార్క్ సెంటర్, బంగారం స్వచ్ఛత వంటి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. కానీ అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది కస్టమర్లు ఈ సౌకర్యాన్ని ఉపయోగించకపోవడంతో మోసపోతున్నారు.
బీఐఎస్ అధికారులు నిబంధనలు పాటించని దుకాణాలపై ఆభరణాల స్వాధీనం, కేసులు, అపరాధ రుసుములు విధిస్తామని హెచ్చరించారు.