నూతన సంవత్సరం వేడుకల కోసం దేశంలోని ప్రముఖ నగరాలు సిద్ధమవుతున్నాయి. నోయిడా పోలీసులు వేడుకల సమయంలో అవాంఛిత ఘటనలు చోటుచేసుకోకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్న వ్యక్తులను సురక్షితంగా వారి ఇళ్లకు చేర్చేందుకు ప్రత్యేక క్యాబ్, ఆటో సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు.
బార్ మరియు రెస్టారెంట్ యజమానుల సహకారంతో క్యాబ్, ఆటో సేవలను ఏర్పాటు చేసి, ఎక్కువ మత్తులో ఉన్నవారిని ఇంటికి చేర్చే విధానం నోయిడా పోలీసులు చేపట్టారు. డ్రోన్ నిఘా, సీసీటీవీ కెమెరాలు, హెల్ప్‌డెస్క్‌లు ద్వారా వేడుకలను సురక్షితంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నారు. మత్తులో ఉన్న వ్యక్తులు వాహనాలు నడపకుండా పోలీసులు ప్రత్యేక పర్యవేక్షణ చేపడుతున్నారు.
నోయిడా డీసీపీ రామ్ బదన్ సింగ్ ప్రకటన ప్రకారం, వివిధ మాల్స్, పబ్‌లు, రెస్టారెంట్ల వద్ద ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేస్తూ, రాత్రిపూట అద్దె క్యాబ్‌లు అందుబాటులో ఉంచారు. ప్రముఖ ప్రాంతాల్లో సుమారు 3,000 మంది సిబ్బందిని మోహరించి, 6,000కు పైగా సీసీటీవీ కెమెరాలు, డ్రోన్‌లను ఏర్పాటు చేశారు.
అధిక ట్రాఫిక్ ఉండే ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లను సమీక్షించేందుకు సీనియర్ పోలీసు అధికారులు రంగంలోకి దిగుతున్నారు. డాగ్ స్క్వాడ్‌లు, బాంబు నిర్వీర్య బృందాలను రంగంలోకి దింపి నగరంలో శాంతి, భద్రతను పరిరక్షించేందుకు నోయిడా పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
