నర్సీపట్నంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో పెద్ద బొడ్డేపల్లి వైయస్సార్‌సీపీ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించి, అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ వైయస్ జగన్ అధికారంలోకి రాగానే ప్రజల కష్టాలను నవరత్నాల పథకాల ద్వారా తగ్గించారని తెలిపారు. సంక్షేమ పథకాలు ప్రజల జీవితాల్లో కీలక మార్పులు తీసుకువచ్చాయని, నవరత్నాల అమలుతో అనేక కుటుంబాలకు మేలు జరిగిందని ఆయన పేర్కొన్నారు.
గత ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలయినప్పటికీ, ప్రజల్లో జగన్‌కి ఉన్న ఆదరణ తగ్గలేదని గణేష్ స్పష్టం చేశారు. ఇప్పటికీ 40 శాతం మంది ఓటర్లు జగన్‌కే మద్దతుగా ఉన్నారని, ఆయన నాయకత్వంలో తిరిగి వైయస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో 175 నియోజకవర్గాల్లో ఒంటరిగానే పోటీ చేసి గెలిచే సామర్థ్యం జగన్‌కు మాత్రమే ఉందని గణేష్ వ్యాఖ్యానించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి పార్టీ సిద్ధాంతాలను విస్తృతంగా ప్రచారం చేయాలని, ప్రజల సమస్యలపై పోరాటాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు.