ఆంధ్రప్రదేశ్‌లో మరో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. మనిషి మరణం ఎప్పుడు, ఏ రూపంలో వస్తుందో ఎవరికీ ముందుగా తెలియదు. సంతోషంగా మాట్లాడుతున్న వ్యక్తి ఒక్కసారిగా కళ్లముందే కూలిపోవచ్చు. అలాంటి విషాదకర ఘటన డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో జరిగింది. మరణాన్ని ఎదుర్కొంటూనే 50 మంది విద్యార్థుల ప్రాణాలను కాపాడిన డ్రైవర్ ధైర్యసాహసానికి అందరూ కృతజ్ఞతలు వ్యక్తం చేస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే: ఆలమూరు మండలం మడికి గ్రామానికి చెందిన డ్రైవర్ డి. నారాయణరాజు రాజమహేంద్రవరం డైట్ ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన బస్సు నడుపుతుండేవారు. ప్రతిరోజు లాగే ఆ రోజు కూడా కొత్తపేట మండలం గంటి నుంచి విద్యార్థులను తీసుకుని కళాశాల వైపు బయలుదేరారు.
అయితే ప్రయాణమధ్యలో ఆయనకు ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. ఆ సమయంలో బస్సులో సుమారు 50 మంది విద్యార్థులు ఉన్నారు.
ALSO:అవంతి ఇంజినీరింగ్ కళాశాల లో ఘనంగా 2025 ప్రెషర్స్ డే వేడుకలు
ఆ పరిస్థితిలో చాలా మందిలా భయపడి వదిలిపెట్టకుండా, నారాయణరాజు సమయస్ఫూర్తితో వ్యవహరించారు. వేగం తగ్గించి బస్సును సురక్షితంగా రోడ్డు పక్కన ఆపి స్టీరింగ్‌పై వాలి కూలిపోయారు.
విద్యార్థులు ఏమైందోనని వెళ్లి చూసేసరికి ఆయన అప్పటికే మృతి చెందారు. తాను మరణించకముందే 50 మంది విద్యార్థులను కాపాడిన నారాయణరాజు ధైర్యానికి అందరూ అభినందనలు తెలుపుతున్నారు. ఆయన త్యాగం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.
