ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిన నేపథ్యంలో అనేక రకాల మోసాలు జరుగుతున్నాయి. ఈ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. వినియోగదారుల రక్షణను బలోపేతం చేసేందుకు ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సృష్టిస్తున్న సంచలనాలు అందరికి తెలిసిందే. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఏఐ టూల్స్‌ను ఉపయోగించి అవసరాల కోసం కొత్త పరిష్కారాలను అందిస్తున్నాయి. ఈ పరిష్కారాలు వినియోగదారులను ఈ-కామర్స్ మోసాల నుంచి రక్షించడానికి సాయపడతాయని మంత్రి వెల్లడించారు.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వినియోగదారులను రక్షించే కీలకమైన చర్యలను తీసుకుంది. ఇవి ఏఐ టూల్స్ ద్వారా మోసపూరిత మార్కెటింగ్ పద్ధతులను గుర్తించి, హెల్ప్‌లైన్ సేవలను అందించే విధంగా రూపొందించబడ్డాయి. ముఖ్యంగా ఆన్‌లైన్ షాపింగ్ భద్రతను పెంచడానికి ఈ చర్యలు తీసుకుంటున్నారు.
ప్రభుత్వం రూపొందించిన నూతన వినియోగదారుల రక్షణ చర్యలు, జాగో గ్రాహక్ జాగో మొబైల్ అప్లికేషన్, ఎన్‌సీసీ హెల్ప్‌లైన్ వంటి ప్లాట్‌ఫారమ్‌లు వినియోగదారుల కోసం అందుబాటులో ఉన్నాయి. ఈ సేవలను ప్రముఖ సంస్థలు తమ యాప్స్‌లో అందించనున్నాయి. 2023 జనవరి-నవంబర్ మధ్య 6,587 వినియోగదారుల సమస్యలను పరిష్కరించినట్లు మంత్రి తెలిపారు.