జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ మంగళవారం న్యూఢిల్లీలో చైనా విదేశాంగమంత్రి వాంగ్ యీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 1 వరకు చైనా తియాంజిన్‌లో జరగనున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారని ఆయన వెల్లడించారు. ఇది మోదీ పాల్గొనబోతున్నారన్న మొదటి అధికారిక ధ్రువీకరణగా నిలిచింది.
అజిత్ డోభాల్ మాట్లాడుతూ, “భారత్–చైనా సంబంధాల్లో కొత్త ఉత్సాహం, శక్తి కనిపిస్తున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో శాంతి నెలకొంది. రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం అయ్యాయి. రాబోయే ఎస్‌సీఓ సమావేశం నేపథ్యంలో ఈ చర్చలు కీలక ప్రాధాన్యతను సంతరించుకున్నాయి” అని తెలిపారు.
ఇదే సందర్భంలో వాంగ్ యీ మాట్లాడుతూ, అజిత్ డోభాల్ ఆహ్వానం మేరకు రెండు రోజులపాటు భారత్‌ను సందర్శించానని తెలిపారు. భారత్–చైనా సరిహద్దు సమస్యలపై 24వ ప్రత్యేక ప్రతినిధుల చర్చలు జరపడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. “ఇరు పక్షాల నేతలు వ్యూహాత్మక మార్గదర్శకత్వాన్ని అనుసరించాలి. సరిహద్దు సమస్యలను పరిష్కరించి, పరస్పర సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలి. ద్వైపాక్షిక సంబంధాల వృద్ధి కోసం అవసరమైన పరిస్థితులను సృష్టించడానికి చైనా సిద్ధంగా ఉంది” అని వాంగ్ యీ అన్నారు.
ఇక తన పర్యటనలో భాగంగా వాంగ్ యీ, భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌తో కూడా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరుదేశాలు పలు అంశాలపై అవగాహనకు వచ్చాయి. ముఖ్యంగా భారత్‌కు ఎరువులు, బోరింగ్ యంత్ర పరికరాలు, రేర్ ఎర్త్ మినరల్స్ సరఫరాపై ఉన్న పరిమితులను ఎత్తివేయడానికి చైనా అంగీకరించింది. 2023లో భారత్‌కు రావలసిన యూరియా సరఫరాను రెండు చైనా సంస్థలు నిలిపివేసిన విషయం తెలిసిందే. జూన్‌లో కొంత మేర సడలించినప్పటికీ, తాజా చర్చలతో ఎరువుల సరఫరా మార్గం పూర్తిగా సుగమమైంది.
మంగళవారం సాయంత్రం వాంగ్ యీ ప్రధాని నివాసం లోక్‌కల్యాణ్ మార్గ్‌లో నరేంద్ర మోదీని కలవనున్నారు. ఈ భేటీలో ఇరుదేశాల మధ్య ఇప్పటికే కుదిరిన ఒప్పందాలు, చర్చల ఫలితాలు, భవిష్యత్ సహకారంపై చర్చించనున్నట్లు అధికారిక సమాచారం. వాంగ్ యీ పర్యటన లక్ష్యం భారత్‌తో సహకారాన్ని మరింతగా పెంచుకోవడమేనని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.