గాజాలో శాంతి కోసం జరిగిన అంతర్జాతీయ సదస్సులో ప్రపంచ నేతల మధ్య జరిగిన ఓ సరదా సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తీవ్ర రాజకీయ చర్చల మధ్య చోటుచేసుకున్న ఈ హాస్యభరిత సంఘటన సమావేశానికి కాస్త ఉల్లాసం తెచ్చింది.
ఈజిప్టులోని షార్మ్ ఎల్-షేక్‌లో జరిగిన గాజా శాంతి సదస్సులో టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ మధ్య ఆసక్తికర సంభాషణ సాగింది. అనధికారికంగా మాట్లాడుకుంటున్న సమయంలో ఎర్డోగాన్ మెలోనీని చూసి, “మీరు బాగున్నారు కానీ పొగతాగడం మాత్రం మానేయండి” అని సూచించారు.
దీనిపై మాక్రాన్ వెంటనే నవ్వుతూ, “అది అసాధ్యం!” అని వ్యాఖ్యానించగా, మెలోనీ కూడా వెంటనే చమత్కారంగా స్పందిస్తూ, “నాకు తెలుసు! కానీ పొగతాగడం మానేస్తే నాకు చిరాకు ఎక్కువై ఎవరినైనా ఏమైనా అనేసేదాన్నేమో” అని నవ్వేశారు. ఈ సన్నివేశం అక్కడి మీడియా కెమెరాల్లో రికార్డ్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది.
తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్ గత కొంతకాలంగా ‘పొగ రహిత తుర్కియే’ ప్రచారాన్ని బలంగా ముందుకు తీసుకెళ్తున్నారు. తాను కూడా ప్రజల్లో పొగాకు వినియోగం తగ్గించేందుకు తరచూ అవగాహన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక మెలోనీ విషయానికొస్తే, గతంలో ఒక పుస్తకంలో “స్మోకింగ్ నాకు ఒత్తిడి తగ్గించే సాధనం” అని పేర్కొనడం గమనార్హం.
గాజాలో కాల్పుల విరమణ, మానవతా సాయం, పునర్నిర్మాణం వంటి కీలక అంశాలపై చర్చించేందుకు జరిగిన ఈ సమావేశంలో ఈ చిన్న సరదా సంభాషణ పాల్గొన్న నేతల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని సృష్టించింది.
