విజయనగరం జిల్లా గజపతినగరంలో శుక్రవారం తెల్లవారుజామున వరుస దొంగతనాలు చోటుచేసుకున్నాయి. మొత్తం 8 షాపుల్లో చోరీ జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రధానంగా మొబైల్ షాప్, కిరాణా దుకాణాలు, వస్త్ర దుకాణాలు లక్ష్యంగా మారాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్‌తో కలిసి ఫింగర్ ప్రింట్ల సేకరణ చేపట్టారు.
డిఎస్పి భవ్య రెడ్డి ఘటనాస్థలాన్ని సందర్శించి, దొంగతనాలపై దర్యాప్తు చేపట్టారు. చోరీలు జరిగిన విధానాన్ని పరిశీలించిన అధికారులు, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యాపారస్తులు తమ షాపులను రాత్రిపూట మరింత భద్రతతో ఉంచాలని సూచించారు.
చోరీకి గురైన మొబైల్ షాప్ యజమాని వెంకటేష్ మాట్లాడుతూ, దొంగలు దుకాణంలో ఉంచిన రూ. 1.5 లక్షల నగదు, 26 మొబైల్ ఫోన్లు అపహరించారని తెలిపారు. మొత్తం ఆరు లక్షల రూపాయల పైన నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు. ఇతర షాపుల్లోనూ దొంగలు నగదు, విలువైన వస్తువులు దోచుకెళ్లారని షాపు యజమానులు వాపోయారు.
ఈ ఘటనతో గజపతినగరం వ్యాపారస్తుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వరుస దొంగతనాలతో వ్యాపార వర్గాలు భయాందోళనకు గురవుతున్నాయని, రాత్రి గస్తీ పెంచాలని డిమాండ్ చేశారు. పోలీసులు త్వరలోనే నిందితులను పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.