యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన తాజా చిత్రం ‘కె-ర్యాంప్’ ఈ నెల అక్టోబర్ 18న దీపావళి కానుకగా గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది. అయితే టైటిల్, ట్రైలర్‌పై సోషల్ మీడియాలో వస్తున్న చర్చల నేపథ్యంలో దర్శకుడు జైన్స్ నాని కీలక వివరణ ఇచ్చారు. ఈ సినిమా బూతు కంటెంట్ కాదని, కుటుంబమంతా కలిసి చూడగలిగే మంచి కథా చిత్రం అని ఆయన తెలిపారు.
జైన్స్ నాని మాట్లాడుతూ, “‘కె-ర్యాంప్’ అనే టైటిల్‌ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. హీరో పాత్ర పేరు కుమార్, అతని జీవితంలో ఎదురయ్యే కష్టాలను సూచించేందుకు ‘ర్యాంప్’ అనే పదం వాడాం. టైటిల్ కథకు, హీరో క్యారెక్టర్‌కి బాగా సరిపోయింది” అని వివరించారు.
ట్రైలర్‌పై వస్తున్న విమర్శలపై ఆయన స్పందిస్తూ, “ఏ సినిమా అయినా ముందుగా యువతను ఆకట్టుకోవాలి, అందుకే ట్రైలర్‌ను ఆ దిశగా కట్ చేశాం. కానీ సినిమా మాత్రం ఫ్యామిలీ డ్రామా, తల్లిదండ్రులు కూడా చూడగలిగే కథ. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది” అని అన్నారు.
హీరో కిరణ్ అబ్బవరంతో పని చేసిన అనుభవం గురించి మాట్లాడుతూ, “కిరణ్‌తో ఏడాదిన్నర పాటు కలిసి పనిచేశాం. ఆయన బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేశాం. కథ విషయంలో ఆయన జోక్యం చేసుకోలేదు, కేవలం సూచనలు మాత్రమే ఇచ్చారు. సినిమా షూటింగ్‌ను 47 రోజుల్లో పూర్తి చేశాం” అని వెల్లడించారు.
ఈ చిత్రాన్ని హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్లపై రాజేష్ దండా మరియు శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది.
