కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటాడు. ఆయన స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘కాంతార: చాప్టర్ 1’ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో రికార్డులు తిరగరాస్తోంది. ‘కాంతార’ సినిమాకు ప్రీక్వెల్‌గా రూపొందిన ఈ చిత్రం విడుదలైన తొలిరోజు నుంచే ప్రేక్షకుల నుండి అప్రతిహతమైన స్పందనను పొందుతూ దుమ్మురేపుతోంది.
తాజాగా విడుదలైన అప్‌డేట్ ప్రకారం, ‘కాంతార: చాప్టర్ 1’ కేవలం 9 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 509 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది. ఈ అద్భుత విజయాన్ని పురస్కరించుకుని, చిత్ర బృందం ఒక ప్రత్యేక పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. దసరా పండుగ సెలవుల్లో విడుదలైన ఈ చిత్రం, అన్ని వయసుల ప్రేక్షకులను ఆకట్టుకుని అంచనాలకు మించి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
చిత్ర కథ ‘కాంతార’ మొదటి భాగానికి ముందు జరిగిన సంఘటనలపై ఆధారపడి ఉండటం వల్ల, అభిమానుల్లో ఆసక్తి మరింతగా పెరిగింది. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంతో పాటు ప్రధాన పాత్రలోనూ నటించి మరోసారి తన ప్రతిభను నిరూపించుకున్నారు. సినిమా విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, సాంప్రదాయ అంశాలు, పూజా సన్నివేశాలు ప్రేక్షకులను థియేటర్లలో కట్టిపడేస్తున్నాయి.
ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, ఈ వారాంతంలో పెద్ద సినిమాల విడుదలలు లేకపోవడంతో ‘కాంతార: చాప్టర్ 1’ వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఈ చిత్రం కొత్త రికార్డులను సృష్టించే అవకాశముందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.
