మధ్యప్రదేశ్‌లోని ఛింద్వాడా జిల్లాలో జరిగిన విషాద ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. సాధారణ జ్వరం, దగ్గు కోసం వాడిన మందులే చిన్నారుల ప్రాణాలను బలిగొనడం తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కేవలం పదిహేను రోజుల్లోనే తొమ్మిది మంది చిన్నారులు కిడ్నీ విఫలమై మృతి చెందారు.
అధికారుల ప్రాథమిక విచారణలో, మరణించిన చిన్నారుల్లో ఐదుగురు ‘కోల్డ్‌రెఫ్’ సిరప్, ఒకరు ‘నెక్స్‌ట్రో’ సిరప్ వాడినట్లు గుర్తించారు. వీటిలో ఉన్న డెక్స్ట్రోమెథోర్ఫాన్ హైడ్రోబ్రోమైడ్ అనే పదార్థం కలుషితంగా ఉండి ప్రాణనష్టం కలిగించినట్లు అనుమానిస్తున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అనుమానిత దగ్గు మందుల పంపిణీని వెంటనే నిలిపివేశారు. మందుల నమూనాలను పరీక్షలకు పంపగా, ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇదే సమయంలో, రాజస్థాన్‌లోని సికార్ జిల్లాలో కూడా ఇలాంటి ఒక చిన్నారి మరణించడం పరిస్థితిని మరింత తీవ్రతరం చేసింది. దీంతో జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం (NCDC) రంగంలోకి దిగింది. రెండు రాష్ట్రాల్లోని ఆసుపత్రులు, గ్రామాలు, నీటి వనరులు, మందుల నమూనాలను సేకరించి, అంటువ్యాధుల కోణంలోనూ పరీక్షలు నిర్వహిస్తోంది.
ముందుజాగ్రత్తగా జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలతో బాధపడుతున్న 1,420 మంది చిన్నారులపై ప్రత్యేక నిఘా పెట్టారు. రెండు రోజులకు మించి అనారోగ్యంతో ఉన్న పిల్లలను సివిల్ ఆసుపత్రుల్లో గంటల తరబడి పర్యవేక్షిస్తూ, పరిస్థితి విషమిస్తే జిల్లా ఆసుపత్రులకు తరలిస్తున్నారు. కోలుకున్న పిల్లలను ఆశా వర్కర్ల పర్యవేక్షణలో ఉంచుతున్నారు.
ఇక ప్రైవేటు వైద్యులకు వైరల్ జ్వరం కేసులను నేరుగా ప్రభుత్వ ఆసుపత్రులకు రిఫర్ చేయాలని ఆదేశించారు. సేకరించిన నీరు, దోమల నమూనాలు నార్మల్‌గా రావడంతో, అనుమానాలన్నీ దగ్గు మందులపైనే మళ్లాయి. ఇప్పటికే రాజస్థాన్ ప్రభుత్వం 19 బ్యాచ్‌ల దగ్గు సిరప్‌ల అమ్మకాలపై నిషేధం విధించింది.
దేశవ్యాప్తంగా ఈ ఘటన ఆందోళన కలిగిస్తోంది. తల్లిదండ్రులు పిల్లలకు ఏ మందు వాడించాలోననే సందేహంలో ఉన్నారు. ఆరోగ్య నిపుణులు వైద్యుల సూచన లేకుండా ఎలాంటి సిరప్‌లు వాడొద్దని హెచ్చరిస్తున్నారు.
