ఉత్తరాంధ్ర ప్రాంతం వరుణుడి ఆగ్రహానికి అల్లాడిపోయింది. ఎడతెరిపి లేని వర్షాలతో విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు చిగురుటాకులా వణికాయి. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కురిసిన వర్షాల ప్రభావంతో అనేక ప్రాంతాల్లో జీవన వ్యవస్థ అస్థవ్యస్థమైంది. రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం విశాఖ జిల్లా కాపులుప్పాడలో నమోదైంది. అక్కడ ఒక్కరోజులోనే 15.3 సెంటీమీటర్ల వర్షం పడింది. ఇదే సమయంలో ఉత్తరాంధ్రలో 25 ప్రాంతాల్లో 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదవడంతో పరిస్థితి తీవ్రతరమైంది.
విశాఖలోని నౌసేనాబగ్ నేవల్ క్వార్టర్స్ ప్రధాన గేటు వద్ద వాననీరు నిలవడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పెదగదిలిలో ఇంటి ముందు భూమి కుంగిపోవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. భీమునిపట్నం మండలం అమనాం గ్రామం వరద నీటిలో చిక్కుకుని పూర్తిగా బయటి ప్రపంచంతో సంబంధం కోల్పోయింది. వరుస వర్షాలతో చెరువులు నిండిపోవడంతో అమనాం గ్రామానికి వెళ్లే రెండు రహదారులపై ఉద్ధృతంగా నీరు ప్రవహిస్తోంది. దీంతో గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి.
శ్రీకాకుళం జిల్లా తీర ప్రాంతం కూడా తీవ్ర ప్రభావానికి లోనైంది. మందస మండలం దున్నూరు పంచాయతీ సముద్రతీరంలో అలల తాకిడికి నాలుగు పడవలు సముద్రంలోకి కొట్టుకుపోయాయి. గెడ్డూరు వద్ద వరద నీరు సముద్రంలోకి చేరుతుండటంతో తీరం కోతకు గురైంది. అయితే అప్రమత్తమైన మత్స్యకారులు పడవలకు తాళ్లు కట్టి ఒడ్డుకు చేర్చడంతో పెద్ద నష్టం తప్పింది.
అల్లూరి సీతారామరాజు జిల్లాలో పలు ప్రాంతాల్లో పంటలు నీట మునిగాయి. గూడెంకొత్తవీధి మండలం రొంపుల ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగి రహదారిపై పడటంతో రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు దేవీపట్నం మండలం పోశమ్మగండి వద్ద గోదావరి నది ఉద్ధృతి పెరిగి పలు గ్రామాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. సాయంత్రానికి గోదావరి నది నిండుకుండను తలపించేలా వరద ఉధృతి పెరిగింది.
తూర్పుగోదావరి జిల్లాలోని కొవ్వూరు గోష్పాద క్షేత్రం ప్రధాన రేవు వరదతో నిండిపోగా, నందీశ్వరుని విగ్రహాల వరకు నీరు చేరింది. గామన్ వంతెన, హేవలాక్, రోడ్‌కం రైలు వంతెనల వద్ద వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తూ సాగేలా ఉంది. కోనసీమ జిల్లాలో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తుండగా, కొన్ని చోట్ల 11.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఐ పోలవరంలో అత్యధికంగా 20.4 మిల్లీమీటర్లు, సకినేటిపల్లిలో 5.4 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది.
ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమలో కూడా వర్ష ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. అన్నమయ్య జిల్లాలో పించా ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. ఎగువ నుంచి 200 క్యూసెక్కుల నీరు చేరుతుండటంతో అధికారులు ఎడమ కాలువలకు నీటిని మళ్లించారు. అవసరమైతే గేట్లు ఎత్తే అవకాశముందని అధికారులు తెలిపారు.
ఇక రాష్ట్రవ్యాప్తంగా అధికారులు అత్యవసర చర్యలు చేపట్టారు. అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు. వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వర్షాల ప్రభావం తగ్గే వరకు ప్రజలు అత్యవసర పరిస్థితులు తప్ప బయటకు వెళ్లొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రస్తుతం ఉత్తరాంధ్రలో జీవన విధానం దెబ్బతిన్నప్పటికీ, అధికారులు, రెవెన్యూ సిబ్బంది, పోలీస్ విభాగాలు అప్రమత్తంగా వ్యవహరిస్తూ సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. రానున్న రెండు రోజులు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడం ప్రజల్లో మరింత ఆందోళన కలిగిస్తోంది.