రష్యా డ్రోన్ దాడులను ఎదుర్కొనే నూతన మార్గాన్ని ఉక్రెయిన్ ప్రభుత్వం ప్రకటించింది. ఇకపై డ్రోన్లను కూల్చే సామర్థ్యం ఉన్న పౌరులే ఆయుధంగా మారనున్నారు. వారికి నెలకు రూ. 2.2 లక్షల వరకూ జీతం ఇవ్వనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఉక్రెయిన్ రక్షణ శాఖ ప్రతిపాదించిన ఈ వినూత్న కార్యక్రమానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రష్యా తరఫున వరుసగా జరుగుతున్న డ్రోన్ దాడులపై సమర్థవంతంగా స్పందించేందుకు, ప్రజల సహకారాన్ని సమీకరించే ఉద్దేశంతో ఈ “డ్రోన్ హంటర్స్” ప్రోగ్రామ్ రూపొందించారు. ఈ కార్యక్రమం కింద, శత్రుదేశ డ్రోన్లను గుర్తించి, సమయానుకూలంగా నేలకూల్చగలిగే ప్రత్యేకంగా శిక్షణ పొందిన పౌరులకు నెలకు సుమారు 2,200 యూరోలు (భారత రూపాయలలో సుమారుగా రూ. 2.2 లక్షలు) జీతం ఇవ్వబడుతుంది. వీరు ప్రత్యక్షంగా రక్షణ వ్యవస్థలో భాగంగా పనిచేస్తారు. ఇది కేవలం సైనిక వ్యూహం మాత్రమే కాదు ఉక్రెయిన్ ప్రజల భాగస్వామ్యంతో దేశ రక్షణకు సమిష్టిగా ఎదురుదాడి అనే ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయం అని రక్షణ శాఖ ప్రతినిధులు తెలిపారు.
“ఉక్రెయిన్‌కు ‘డ్రోన్ హంటర్స్’ కొత్త ఆయుధం – పౌరులకు నెలకు రూ. 2.2 లక్షల జీతం”
