కాంగ్రెస్ ఎంపీ రాకేశ్ రాథోడ్‌ను ఉత్తరప్రదేశ్ పోలీసులు అత్యాచార ఆరోపణల కేసులో అరెస్టు చేశారు. సీతాపూర్‌లోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతుండగా పోలీసులు ఆకస్మికంగా అదుపులోకి తీసుకుని కోర్టుకు తరలించారు.
బాధితురాలు తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి నాలుగేళ్లుగా అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపిస్తూ జనవరి 17న పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన ఆరోపణలకు సంబంధించి కాల్ రికార్డింగ్‌లను కూడా సమర్పించింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
ఈ క్రమంలో బుధవారం ఉదయం రాకేశ్ రాథోడ్ అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్‌లో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, న్యాయస్థానం పిటిషన్‌ను తిరస్కరించింది. గతంలో ఎంపీ-ఎమ్మెల్యే కోర్టులో కూడా ఆయన వేసిన పిటిషన్‌ను తిరస్కరించడం గమనార్హం.
కోర్టు నిర్ణయం వెలువడిన వెంటనే పోలీసులు ఎంపీ రాథోడ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయనపై ఉన్న ఆరోపణలపై విచారణ కొనసాగుతోంది. కేసు తీరుపై రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతోంది.