Madras High Court: తమిళనాడులోని కరూర్ తొక్కిసలాట బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించే విషయంలో సీఎం విజయ్(CM Vijay) నేతృత్వంలోని ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. బాధిత కుటుంబాలకు ఉద్యోగాలు కల్పించే ప్రభుత్వ నిర్ణయాన్ని రద్దు చేస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు తాజాగా స్టే విధించింది. దీంతో నియామకాల ప్రక్రియకు మరోసారి మార్గం సుగమమైంది. జస్టిస్ జేబీ పార్డీవాలా, జస్టిస్ కె. వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించింది. బాధిత కుటుంబాలకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాన్ని పూర్తిగా తప్పుబట్టాల్సిన అవసరం ఏముందని ధర్మాసనం ప్రశ్నించింది. కుటుంబానికి ప్రధాన ఆసరాగా ఉన్న వ్యక్తిని కోల్పోయిన సందర్భంలో, ఆ కుటుంబంలోని కుమారుడు లేదా కుమార్తెకు ప్రభుత్వం ఉద్యోగం కల్పించడంలో తప్పేముందని వ్యాఖ్యానించింది.
కరూర్ తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. బాధిత కుటుంబాల పునరావాసంలో భాగంగా ఒక్కో కుటుంబం నుంచి అర్హత ఉన్న ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ నియామకాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు జూలై 27న ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేసింది. రాజ్యాంగంలోని 14, 16 అధికరణాలకు ఈ నిర్ణయం విరుద్ధమని పేర్కొంది. దీంతో తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తాజాగా హైకోర్టు తీర్పుపై స్టే విధించడంతో బాధిత కుటుంబాలకు ఉద్యోగాలు కల్పించే ప్రక్రియకు మళ్లీ అవకాశం ఏర్పడింది.
ALSO READ: Akkineni Nagarjuna | నేను కూడా సైబర్ క్రైమ్ బాధితుడినే.. షాకింగ్ విషయం చెప్పిన నాగార్జున
